Sainath Thotapalli: 'సితార' సినిమా కథ ఆ విధంగా పుట్టిందట!
- 1984లో వచ్చిన 'సితార' సినిమా
- దర్శకుడిగా హిట్ కొట్టిన వంశీ
- వంశీతో పరిచయం గురించి చెప్పిన సాయినాథ్
- ఆ సినిమా కథను గురించి వివరణ
వంశీ దర్శకత్వంలో 1984లో వచ్చిన 'సితార' సినిమా ఓ సంచలనం. ఓ పాడుబడిన కోటలో ఓ అందమైన యువతి. ఆ అమ్మాయికి బయటప్రపంచాన్ని చూపించే ఓ అబ్బాయి. ఈ ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథనే ఈ సినిమా. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా స్వరాలు ప్రాణం పోశాయి. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ సినిమాను గురించి రచయిత సాయినాథ్ తోటపల్లి మాట్లాడారు.
"నేను దాదాపు 100 సినిమాలకు రచయితగా పనిచేశాను. కె విశ్వనాథ్ .. జంధ్యాలగారి వంటి దర్శకులతో నా ప్రయాణం కొనసాగింది. 'మంచు పల్లకి'కి ముందే నేను, వంశీ కలిసి పనిచేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆ సమయంలో నేను ఇంగ్లిష్ నవలలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. అలాగే ఇంగ్లిష్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని" అని అన్నారు.
" ఒక రోజున వంశీ నన్ను కలిశాడు. అప్పుడు నేను ఒక ఇంగ్లిష్ కథను గురించి అతనితో చెప్పాను. ఆ కథలో కొన్ని మార్పులు చేస్తూ, వంశీ దానిని 'మహల్లో కోకిల' అనే కథగా రాసుకున్నాడు. ఆ తరువాత దానినే 'సితార' పేరుతో సినిమాగా తీశాడు. ఒరిజినల్ కథను అనువదించే విషయంలో ఇద్దరం కలిసే పనిచేశాము. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది అందరికీ తెలిసిందే" అని చెప్పారు.