Prathipati Pulla Rao: జగన్ కు తగిలింది రాయా.. ఎయిర్ బుల్లెట్టా?: ప్రత్తిపాటి పుల్లారావు
- పోలీసుల తీరు అనుమానాలను పెంచుతోందన్న ప్రత్తిపాటి
- దాడి వివరాలను పోలీసులు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్న
- వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులను పక్కన పెట్టాలని డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది జగన్ పై జరిగిన హత్యాయత్నమని వైసీపీ ఆరోపిస్తుండగా... ఇది మరో కొడికత్తా డ్రామా అని టీడీపీ, జనసేన ఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... విజయవాడలో జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనలో తమ అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. పోలీసుల తీరు అనుమానాలను మరింతగా పెంచుతోందని... దాడి వివరాలను పోలీసులు ఇంకా ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. జగన్ కు తగిలింది రాయా... లేక ఎయిర్ బుల్లెట్టా అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీకి విధేయులుగా పని చేస్తున్న పోలీసులను ఎన్నికల సంఘం తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై కూడా నిన్న రాళ్ల దాడులు జరిగాయని... విపక్ష నేతలకు రక్షణ లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పారదర్శకంగా ఎన్నికలు జరగనప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని అన్నారు. ఎన్నికలు పక్షపాతం లేకుండా జరగాలంటే వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులను పక్కన పెట్టాలని చెప్పారు.