Kokapet: కోకాపేట వైపు ఒంటరిగా వెళ్తున్నారా?.. అయితే జరభద్రం!
- హైదరాబాద్ శివారు ప్రాంతాలలో దొంగల హల్చల్
- ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలు
- కోకాపేటలో వరుసగా నమోదవుతున్న ఇలాంటి చోరీ ఘటనలు
- అందుకే కోకాపేట వైపు ఒంటరిగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ శివారు ప్రాంతాలలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి, చోరీలకు పాల్పడుతున్నారు. ఇదే కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా కోకాపేటలో జరిగింది. ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తిని గమనించిన కొందరు మొదట అతనితో మాటలు కలిపారు. ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ఆ వ్యక్తిని తమ ఆటోలో ఎక్కించుకున్నారు.
అలా ఆటోలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు. నీ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని, లేనిపక్షంలో చంపేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న నాలుగున్నర వేలు తీసి వారికి ఇచ్చేశాడు. వాటిని తీసుకుని ఆ దొంగల ముఠా ఆటోలో అక్కడి నుంచి పరారైంది. దాంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు ఘటనాస్థలిలో రికార్డయిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇక కోకాపేట సర్వీస్ రోడ్డులో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది వరుసగా ఐదో ఘటన కావడం గమనార్హం.
దొంగల ముఠాలు ఒంటరిగా ఉన్నవారినే టార్గెట్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అందుకే కోకాపేట వైపు ఒంటరిగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఏవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.