Jagan: ఇలాంటి దాడులు ఏమీ చేయలేవు.. గెలుపు మనదే: జగన్
- గాయం కారణంగా ఒకరోజు రెస్ట్ తీసుకున్న జగన్
- ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నాన్న సీఎం
- మనల్ని ఎవరూ ఆపలేరని ధీమా
విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే... ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు.
ఈ సందర్భంగా వారితో జగన్ మాట్లాడుతూ... ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని చెప్పారు. ఇలాంటి దాడులే కాదు ఎలాంటి దాడులు కూడా మనల్ని ఆపలేవని అన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని... మనం మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. మనల్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తనను పలకరించేందుకు వచ్చిన నేతలందరినీ చిరునవ్వుతో పలకరించిన జగన్ ... అనంతరం అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభించారు. గాయం అయిన చోట బ్యాండేజ్ వేసుకుని వెళ్లారు.
ప్రస్తుతం గన్నవరంలో కొనసాగుతున్న జగన్ యాత్రకు వైసీపీ మద్దతుదారులు పోటెత్తారు. రోడ్లు కిక్కిరిసి పోయాయి. కాసేపట్లో జగన్ యాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం గుడివాడ శివార్లలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.