Jagga Reddy: ఏపీలో కాంగ్రెస్ గెలవాలి... అప్పుడే రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jagga Reddy interesting comments on AP politics
  • జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు... చంద్రబాబు కొట్టాడని ఇంకొకరు చెబుతున్నారన్న జగ్గారెడ్డి
  • విభజన జరగడం వల్ల ఏపీ సీఎం హైదరాబాద్ రాకుండా ఆ రాష్ట్రంలోనే గల్లీల్లో తిరుగుతున్నారని వ్యాఖ్య
  • తెలంగాణతో పాటు ఏపీకి స్వయం పాలన వచ్చిందన్న జగ్గారెడ్డి
  • ఏపీ ప్రజలు కాస్త ఆలోచించి కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి
న్యాయంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలవాలని... అప్పుడు ఈ రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాళ్లతో కొట్టుకుంటున్నారని, జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు... చంద్రబాబే కొట్టాడని ఇంకొకరు చెబుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవడం లేదని, అక్కడ రాళ్లతో కొట్టుకుంటున్నారన్నారు. ఇదో కొత్త డ్రామా అని ఆరోపించారు. ఏపీ ప్రజలు ఇంకా ఏం ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు.

జగ్గారెడ్డి సోమవారం హైదరాబాదులోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ఈ అంశాలను తాను టీవీలో చూశానన్నారు. ఏపీ వారికి విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పై కోపం ఉన్నట్లుగా చెబుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ చేసిన తప్పేమిటి? అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయామని... ఎవరికి వారు స్వయంపాలన చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. మీకు స్వయం పాలన రావడం వల్ల మీ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉండటం లేదని... ఏపీలోనే గల్లీల్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు కారణం విభజన, సోనియా గాంధీ అన్నారు. దీనిని ప్రజలు కాస్త ఆలోచించాలని కోరారు. అందుకే న్యాయంగా ఆలోచిస్తే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
Jagga Reddy
Andhra Pradesh
YS Jagan
Chandrababu
Lok Sabha Polls
Andhra Pradesh Assembly

More Telugu News