Jagga Reddy: మన్మోహన్ హయాంలో రూ.28 వేలుగా బంగారం ధర... ఇప్పటి ధర తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి
- మోదీ హయాంలో బంగారం ధర రూ.75వేలకు చేరుకుందన్న జగ్గారెడ్డి
- రాహుల్ గాంధీ ప్రధాని అయితే బంగారం ధరలను నియంత్రిస్తారని వ్యాఖ్య
- రాముడు, హనుమంతుడిని బీజేపీ వాళ్లు లీడర్లుగా మార్చారని ఆగ్రహం
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు చివరిసారి 2014లో తులం బంగారం ధర రూ.28 వేలుగా ఉందని, కానీ ప్రధాని మోదీ వచ్చాక ఇప్పుడు రూ.75 వేలకు చేరుకుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తే బంగారం ధర నియంత్రిస్తారని... ఆ తర్వాత క్రమంగా ధర తగ్గించే ఆలోచన చేస్తారన్నారు. సాధారణంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. అయితే పసిడి ధరలపై జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మోదీ హయాంలో అన్ని ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు పసిడి ధరలూ పెరిగాయన్నారు.
ఇది కూడా చాలా ముఖ్యమైన అంశమని... మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని ధరలతో పాటు బంగారం ధరల నియంత్రణ జరుగుతుందని జోస్యం చెప్పారు. అన్నింటి ధరలు తగ్గి భారం పోవాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే అన్నారు. మీరంతా బంగారం కొనాలంటే కాంగ్రెస్ రావాలని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పుట్టిందే ప్రధానమంత్రుల కుటుంబంలో అన్నారు. దేశంలో ప్రధాని అయ్యే అర్హత ఆయనకు ఉందన్నారు. అధికారం కోసం ఆయన అడ్డదారులు తొక్కలేదన్నారు. ప్రజల సమస్యలు తెలిసినప్పటికీ... మరింత లోతుగా తెలుసుకోవడానికి భారత్ జోడో యాత్ర పేరుతో 4800 కిలో మీటర్లు నడిచారన్నారు.
బీజేపీ శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి పరిపాలన విధానం తెలియదని విమర్శించారు. రాముడు దేవుడు అనీ, కానీ బీజేపీ వారు ఆయనను లీడర్‌ని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించిందన్నారు. అప్పులు భారీగా పెంచారని ఆరోపించారు. రాముడు, హనుమంతుడు బీజేపీ పార్టీ నాయకులు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కూడా దేవుడిని మొక్కతాడని... కానీ కెమెరాలు పెట్టుకోడని బీజేపీకి చురక అంటించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన కోరిక అన్నారు. ఇందుకు తెలంగాణలో 15 సీట్లు గెలుచుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.