Gudivada Amarnath: అంత ఖర్మ మాకు పట్టలేదు: గుడివాడ అమర్ నాథ్
- సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన అవసరం లేదన్న గుడివాడ
- ఓటమి భయంతోనే జగన్ పై దాడి చేయించారని మండిపాటు
- తాను బ్యాక్ డోర్ పొలిటీషన్ ను కాదని వ్యాఖ్య
ముఖ్యమంత్రి జగన్ ఏం తప్పు చేశారని రాళ్లు విసురుతారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే అవుతుందని ఆయన అన్నారు. సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన ఖర్మ తమకు లేదని చెప్పారు. గాజువాక సభలో వైసీపీపై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని అన్నారు. గాజువాకలో చంద్రబాబు మీద వారి పార్టీ వాళ్లే రాళ్లు వేసి, వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు గెలవలేమనే భయం పట్టుకుందని... అందుకే జగన్ పై రాయితో దాడి చేయించారని దుయ్యబట్టారు. ఇలాంటి దాడులకు జగన్ భయపడరని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో జగన్ నిలిచిపోయారని... వైసీపీ మరోసారి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని అమర్ నాథ్ తెలిపారు. దావోస్ లో చలి ఉండటం వల్ల అక్కడ జరిగిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు వెళ్లలేదని తాను అనలేదని... దమ్ముంటే తాను అలా అన్నట్టు సాక్ష్యం చూపించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని చెప్పారు. తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని... తన తాత, తండ్రి కూడా ప్రజాప్రతినిధులేనని తెలిపారు.