CM Jagan: జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు?
- ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు!
- ఫుట్ పాత్ మీద వేసే టైల్స్ ముక్కతో దాడి
- అధికారికంగా ప్రకటించని ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాఫ్తుకు సంబంధించి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీలనలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫుట్ పాత్ పై వేసే టైల్స్ లో విరిగిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సత్తి.. సడెన్ గా సీఎంపైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సత్తితో పాటు అతడి పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్ లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎంపై దాడికి కారణమేంటనే వివరాలు కానీ, దాడి వెనక రాజకీయ పార్టీల హస్తం ఉందా? అనే విషయం కానీ బయటకు రాలేదు.