Revanth Reddy: రేవంత్ ను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా.. కాంగ్రెస్ లో రాజకీయాలు మొదలయ్యాయి: ధర్మపురి అర్వింద్
- రేవంత్ బీజేపీలో చేరడానికి సహకరిస్తానన్న అర్వింద్
- రేవంత్ యాక్టివ్ గా ఉండే లీడర్ అని కితాబు
- కాంగ్రెస్ లో కొనసాగితే అసమర్థుడిగా మారుతారని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే తాను సాదరంగా ఆహ్వానిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఒక స్నేహితుడిగా రేవంత్ బీజేపీలో చేరేందుకు సహకరిస్తానని చెప్పారు. రేవంత్ ను పార్టీలో చేర్చుకోవాలని మాత్రమే తాను రెకమెండ్ చేస్తానని... ఆయనను బీజేపీలో చేర్చుకోవాలో, వద్దో అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. నిజామాబాద్ లో అర్వింద్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ఎంతో యాక్టివ్ గా ఉండే నాయకుడని కొనియాడారు. ఇలాంటి నాయకుడు బీజేపీలో ఉంటే బాగుంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థమైనదని... ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగితే అసమర్థుడిగా మారుతారని అన్నారు. కాంగ్రెస్ లో రేవంత్ ను ఆయన పని ఆయనను చేసుకోనివ్వరని చెప్పారు. బీజేపీలో చేరే విషయంలో రేవంత్ త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని... అనవసరంగా రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెపుతున్నారని అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతాయని అన్నారు.