Civils 2023: సివిల్స్ ఫలితాల విడుదల.. మూడో ర్యాంకు సాధించి సత్తా చాటిన తెలుగు అమ్మాయి
- సివిల్స్ 2023లో 1,016 మంది ఎంపిక
- ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200 మంది ఎంపిక
- మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. 2023 సంవత్సరానికి గాను మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ కు 180 మంది, ఐపీఎస్ కు 200 మంది, ఐఎఫ్ఎస్ కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ - బీ కేటగిరీలో 113 మందిని ఎంపిక చేశారు.
గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ప్రిలిమినరీ రౌండ్ క్లియర్ చేసిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టుల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మెయిన్స్ లో సత్తా చాటిన వారికి జనవరి2 నుండి ఏప్రిల్ 9 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించారు.