Ghulam Nabi Azad: ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటోందేమో... కమలం పార్టీకే మద్దతిస్తోందని అనుమానం: గులాం నబీ ఆజాద్
- కాంగ్రెస్ పార్టీలో మార్పు కోసం 23 మంది సీనియర్లు చాలారోజులుగా పోరాడుతున్నారని గుర్తు చేసిన ఆజాద్
- బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోననే అనుమానం ఉందని వ్యాఖ్య
- రాజకీయ పార్టీలకు ఎప్పుడైనా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం ప్రధాన అంశాలన్న ఆజాద్
- తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని చూడాలని విజ్ఞప్తి
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి అండగా నిలుస్తున్నట్లుగా కనిపిస్తోందని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కాంగ్రెస్ కలిసే ఉందని... కమలం పార్టీయే గెలవాలని ప్రధాన ప్రతిపక్షం కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో మార్పు కోసం 23 మంది సీనియర్ నాయకులు కొన్నాళ్లుగా పోరాడుతున్నారని, కానీ అధినాయకత్వం మాత్రం వారి మాటలను వినడం లేదని విమర్శించారు. అందుకే బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లుగా తనకు అర్థమవుతోందన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమో అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు.
ఈ మేరకు ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ... రాజకీయ పార్టీలకు ఎప్పుడైనా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం ప్రధాన అంశాలు అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ మూడు అంశాలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కశ్మీర్ అంశంలో రాజకీయ పార్టీల వైఖరిపై, వేర్పాటువాదుల తీరుపై ఆజాద్ మండిపడ్డారు. వీరి కారణంగా జమ్మూ కశ్మీర్లో దాదాపు లక్షమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్లో కాల్పుల పరిస్థితుల కారణంగా చాలామంది లోయను విడిచి వెళ్లి బయట స్థిరపడ్డారన్నారు. తాను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
ఏప్రిల్ 19న ఉదంపూర్‌లో, ఏప్రిల్ 26న జమ్మూలో, మే 7న అనంత్‌నాగ్-రాజౌరీలో, మే 13న శ్రీనగర్‌లో, మే 20న బారాముల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ పార్లమెంటు నిర్ణయాన్ని సమర్థిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. జమ్మూ కశ్మీర్లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్ 30, 2024లోపు నిర్వహించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.