KCR: ఎల్లుండి బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత.. ఒక్కొక్కరికి రూ.95 లక్షల చెక్కు అందించనున్న కేసీఆర్
- సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు
- తెలంగాణ భవన్లో మధ్యాహ్నం అందరికీ లంచ్ ఏర్పాటు
- కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై చర్చించనున్న నేతలు
ఎల్లుండి (ఏప్రిల్ 18 గురువారం) బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఫామ్‌లు అందించనున్నారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షలకు చెక్కును అందిస్తారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఎల్లుండి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో లోక్ సభ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొంటారు. వీరందరికీ తెలంగాణ భవన్లో లంచ్ ఏర్పాటు చేస్తారు.
కాగా, కరవు కారణంగా అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసాను ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎల్లుండి జరగనున్న ఈ సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.