Kadiam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి
- ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించారని ఆరోపణ
- పల్లా రాజేశ్వర్ రెడ్డిపై భూకబ్జా కేసు ఉందన్న కడియం శ్రీహరి
- దళిత బంధు పథకంలో రాజయ్య కమీషన్లు తీసుకున్నారని ఆరోపణ
జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వందలకోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ వద్ద రూ.104 కోట్ల కమిషన్ తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని తాను యూనివర్సిటీని, మెడికల్ కాలేజీని తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై భూకబ్జా కేసు కూడా ఉందన్నారు. మన బడి-మన ప్రణాళిక కాంట్రాక్టులు పల్లా తమ్ముడికే ఇప్పించుకున్నారన్నారు.
దళిత బంధు పథకంలో మాజీ మంత్రి రాజయ్య కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అక్రమాలు చేసినట్లు నిరూపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్యలు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. లేదంటే నేను కమీషన్లు తీసుకున్నట్లు వారు నిరూపించినా రాజీనామాకు సిద్ధమన్నారు. తనకు ఇప్పుడు 72 ఏళ్లు అనీ... మూడు దశాబ్దాల క్రితం ఉన్న శక్తి ఇప్పుడు లేదని కడియం అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక కూడా లేదన్నారు. ఈ నాలుగేళ్లు ప్రజల కోసం మరింత కష్టపడి పని చేస్తానన్నారు.