YS Jagan: అయ్యా దత్తపుత్రా... ఇలా భార్యలను మార్చేస్తే అక్కచెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి?: సీఎం జగన్
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం
- ఉండి సెంటర్ లో సభకు హాజరైన సీఎం జగన్
- చంద్రబాబుకు తనపై చాలా కోపం ఉందని వ్యాఖ్య
- అడగకూడని ప్రశ్న అడిగానన్న సీఎం జగన్
- దత్తపుత్రుడు కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తాడని వ్యంగ్యం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సాయంత్రం నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఇక్కడి ఉండి సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, విపక్ష నేత చంద్రబాబుపైనా, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తనపై చాలా కోపం ఉందని, తన గురించి మాట్లాడే సమయంలో ఆయనకు హైబీపీ వస్తుంటుందని అన్నారు.
నాకు ఏదో అవ్వాలని శాపాలు పెడుతుంటాడని, రాళ్లు విసరాలని పిలుపునిస్తుంటాడని వెల్లడించారు. నీ పేరు చెబితే గుర్తుకు వచ్చే మంచి పథకం ఒక్కటైనా ఉందా అని చంద్రబాబును అడిగా... అందుకే నాపై ఆయనకు కోపం... చెరువులో కొంగ మాదిరిగా ఎందుకు జపం చేస్తావు అని అడగకూడని ప్రశ్న అడిగా... అందుకే ఆయనకు నాపై కోపం అని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు అంటే గుర్తుకువచ్చేవి వెన్నుపోటు, మోసం, దగా, కుట్రలు, అబద్ధాలు అని విమర్శించారు .
దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం!
దత్తపుత్రుడు కూడా అంతే. అతడిలోనూ బీపీ బాగా కనిపిస్తోంది. దత్తపుత్రా, దత్తపుత్రా... పెళ్లికి ముందు పవిత్ర హామీలు ఇచ్చి, పిల్లల్ని కని, నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను, భార్యలను మార్చినట్టు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నావు... ఏం మనిషివయ్యా నువ్వు? అని అడిగా.
అయ్యా దత్తపుత్రా... ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు... పదే పదే చేస్తుంటే దాన్ని అలవాటు అంటారయ్యా... పవిత్ర సంప్రదాయాన్ని నడిరోడ్డు మీదకు తీసుకురావడం, ఆడవారి జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా అని అడిగా.
నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ చేస్తే, ఇలా భార్యలను మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి? అని అడిగా. అంతే... ఆ పెద్ద మనిషిలో బీపీ పెరిగిపోతోంది... చేతులు ఊపుతూ, కాళ్లు ఊపుతూ, తల ఊపుతూ మనిషంతా ఊగిపోతాడు... దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం... అంటూ సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.