YS Avinash Reddy: దస్తగిరిని సాక్షిగా మార్చి ఇతరులను ఇరికించాలన్నది సునీత కుట్ర: అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు
- వివేకా హత్య కేసులో న్యాయం చేయాలంటున్న కుమార్తె సునీత
- నిన్న మీడియా సమావేశంలో అవినాశ్ రెడ్డి కాల్ డేటా బయటపెట్టిన వైనం
- దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు సునీత ఒప్పందం కుదుర్చుకున్నారన్న అవినాశ్
- వివేకాను చివరి రోజుల్లో దయనీయ పరిస్థితుల్లోకి నెట్టింది సునీతేనని విమర్శలు
గత ఎన్నికల సమయంలో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ తీవ్ర పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మీడియా సమావేశం నిర్వహించి ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా బయటపెట్టారు.
దీనిపై అవినాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై సునీత కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు.
వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి ఇప్పటికే ఒప్పుకున్నా... దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు సునీత ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ కేసులో దస్తగిరిని సాక్షిగా మార్చి, తమను ఇరికించాలన్నది సునీత కుట్ర అని పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ కు సునీత అభ్యంతరం చెప్పకపోవడాన్ని అందరూ గమనించాలని కోరారు.
వివేకా హత్యపై గతంలో సీబీఐ ఎదుట స్టేట్ మెంట్ ఇచ్చిన సునీత... ఆ తర్వాత వివేకా రాసిన లేఖపై మాట మార్చిందని, లేఖ గురించి తనకు తెలియదని తప్పించుకుందని ఆరోపించారు. అందుకు సీబీఐ కూడా అంగీకరించడం దేనికి నిదర్శనం? అని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐతో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారనేందుకు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు.
"వివేకా హత్య తర్వాత ఎవరో ఫోన్ చేస్తే నేను వెళ్లి సాక్ష్యాధారాలు చెరిపివేశానని సునీత చెబుతోంది. ఈ కేసులో శివప్రకాశ్ రెడ్డి థర్డ్ పార్టీ అని సునీత అంటోంది. వివేకానందరెడ్డికి సొంత బావమరిది అయిన శివప్రకాశ్ రెడ్డి మూడో వ్యక్తి ఎలా అవుతారు?
వివేకా విషయం నాకు శివప్రకాశ్ రెడ్డి చెబితేనే తెలిసింది. ఆ తర్వాతే నేను వివేకా ఇంటికి వెళ్లాను. అప్పటికే అక్కడ పీఏ కృష్ణారెడ్డి ఉన్నాడు. అప్పటికే అతడు సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడాడు.
ఇక, ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పింది కూడా శివప్రకాశ్ రెడ్డే. ఎర్ర గంగిరెడ్డి... వివేకాకు ఎంతటి ఆత్మీయుడో అందరికీ తెలుసు. సునీత టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో భాగమై ఈ విధంగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు... ఎవరికీ భయపడేది లేదు" అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
వివేకాను చివరి రోజుల్లో దయనీయ పరిస్థితుల్లోకి నెట్టింది సునీతేనని, ఆయనకు చెక్ పవర్ లేకుండా చేశారని అవినాశ్ రెడ్డి వెల్లడించారు. రెండో పెళ్లి చేసుకున్నాడని వివేకాను సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. బెంగళూరులో సెటిల్మెంట్ ద్వారా డబ్బు వస్తే, రెండో కుటుంబానికి ఇవ్వాలని ఆయన ప్రయత్నించారని తెలిపారు.