Thota Trimurthulu: శిరోముండనం కేసు: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు
- 28 ఏళ్లుగా శిరోముండనం కేసు విచారణ
- నేడు శిక్ష విధించిన విశాఖ కోర్టు
- తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు, రూ.2.50 లక్షల జరిమానా
శిరోముండనం కేసులో జైలుశిక్షకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరైంది. 28 ఏళ్ల కిందట రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం (ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉంది) వద్ద ఐదుగురు దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై కేసు నమోదైంది. 1996 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఇవాళ విశాఖ న్యాయస్థానం శిరోముండనం కేసు నిందితులకు శిక్ష విధించింది. నిందితుల్లో ఒకరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష, రూ.2.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
అయితే, ఈ తీర్పు వెలువడిన అనంతరం తోట త్రిమూర్తులు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అతడి పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈసారి ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.