Sunil Narine: సునీల్ నరైన్ సెంచరీ మెరుపులు... కోల్ కతా భారీ స్కోరు
- ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసిన కోల్ కతా
- 56 బంతుల్లో 109 పరుగులు చేసిన నరైన్
ఆల్ రౌండర్ సునీల్ నరైన్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ తో పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది.
ఓపెనర్ గా దిగిన సునీల్ నరైన్ చిచ్చరపిడుగులా చెలరేగాడు. 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. నరైన్ క్రీజులో ఉన్నంత సేపు బంతి మైదానం నలుమూలలకు పరుగులు పెట్టింది. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన నరైన్ చివరికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.
కోల్ కతా ఇన్నింగ్స్ లో రఘువంశీ 30, రింకూ సింగ్ 20 (నాటౌట్), ఆండ్రీ రసెల్ 13, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, కుల్దీప్ సేన్ 2, బౌల్ట్ 1, చహల్ 1 వికెట్ తీశారు.
అనంతరం, 224 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు రెండో ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన జైస్వాల్... వైభవ్ అరోరా బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోరు 2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 23 పరుగులు. ఓపెనర్ జోస్ బట్లర్ (2 బ్యాటింగ్), కెప్టెన్ సంజు శాంసన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.