Dubai Flash Rains: భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం.. వీడియో ఇదిగో!

Dubai Airport Flooded Flights Diverted After Heavy Rain

  • మంగళవారం కురిసిన భారీ వర్షంతో దుబాయ్‌ను ముంచెత్తిన వరద
  • పలు షాపింగ్ మాల్స్‌లో మోకాలి లోతు వరకూ నీరు
  • దుబాయ్‌లో విమాన రాకపోకలకు ఆటంకాలు, పలు సర్వీసుల రద్దు
  • యావత్ యూఏఈపైనా అకాల వర్ష ప్రభావం, ఒమన్‌లో 18 మంది మృతి

ఎడారి ప్రాంతమైన దుబాయ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్టు అయిన దుబాయ్ విమానాశ్రయంలో ఆకస్మిక వరద విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పలు సర్వీసులు రద్దయ్యాయి.

భారీ వర్షం కారణంగా దుబాయ్ మొత్తం అస్తవ్యస్తమైంది. పలు షాపింగ్ మాల్స్‌లో మోకాలిలోతు వరకూ నీరు చేసింది. అనేక రోడ్లు కొట్టుకుపోయాయి. పలు రెసిడెన్షియల్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్ల పైకప్పులు, తలుపులు, కిటికీల నుంచి నీరు కారే దృశ్యాలు అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. వరద దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ మార్పులపై ఆందోళన రెకెత్తించాయి. 

ఈ వర్షం ప్రభావం దుబాయ్‌తో పాటూ యావత్ యూఏఈ, పొరుగున ఉన్న బహ్రెయిన్ వరకూ కనిపించింది. అక్కడ అనేక ప్రాంతాలను వరద ముంచేసింది. అన్ని ఎమిరేట్స్‌లలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం వుండటంతో ప్రభుత్యం తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. ఇక ఒమన్‌లో వర్షం బీభత్సానికి పిల్లలతో సహా మొత్తం 18 మంది కన్నుమూశారు. 

గతేడాది జరిగిన కాప్ 28 సదస్సులో యూఏఈ, ఒమన్‌లు.. నానాటికీ పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశాయి. దిద్దుబాటు చర్యలకు పిలుపునిచ్చాయి.

  • Loading...

More Telugu News