Warda Khan: కార్పొరేట్ జాబ్‌కి రిజైన్ చేసి.. సివిల్స్ సాధించి.. స్ఫూర్తిదాయకంగా నిలిచిన వార్దా ఖాన్
- 24 ఏళ్ల వయసులో అద్భుత విజయం సాధించిన నోయిడా యువతి
- సంతృప్తినివ్వలేదని కార్పొరేటు ఉద్యోగానికి రాజీనామా
- ఆసక్తి ఉన్న సివిల్స్‌కు సిద్దమై విజేతగా వార్దా ఖాన్
ఓపక్క కార్పొరేటు ఉద్యోగం ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు.. సమాజానికి తిరిగివ్వాలనే తపన ఒకవైపు.. వెరసి ఓ యువతి స్ఫూర్తిదాయక రీతిలో సివిల్స్ సాధించారు. మంగళవారం వెలువడిన యూపీఎస్సీ సివిల్స్-2023 ఫలితాల్లో నోయిడాకు చెందిన వార్దా ఖాన్ అనే యువతి 18వ ర్యాంక్ సాధించి ఎంతో ప్రత్యేకంగా నిలిచారు. సివిల్ సర్వీసెస్ కోసం సన్నద్ధమవడానికి ఆమె తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
సివిల్స్ ఫలితాల్లో తన పేరు ఉండాలని ప్రతి అభ్యర్థి మాదిరిగా తాను కూడా భావించానని, అయితే టాప్-20 లోపు ర్యాంకు రావడం తాను ఊహించలేదని ఆమె చెప్పారు. ఒక కల లాంటి అనుభూతిని చెందుతున్నానని, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారని వార్దా ఖాన్ చెప్పారు. తొలి ప్రాధాన్యతగా ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఎంచుకున్నానని, అంతర్జాతీయ వేదికలపై భారత్ గర్వపడేలా చేయాలనుకుంటున్నానని 24 ఏళ్ల వార్దా ఖాన్ తన లక్ష్యాన్ని వెల్లడించారు. దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయడమే తన లక్ష్యమని, విదేశాలలోని ప్రవాస భారతీయులకు సాయం చేయాలనుకుంటున్నానని వివరించారు.
నోయిడాలోని వివేక్ విహార్ ప్రాంతానికి చెందిన వార్దా ఖాన్ ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని ఖల్సా కాలేజ్‌లో కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రి పూర్తి చేశారు. ఏకైక సంతానమైన వార్ధా ఖాన్ తండ్రి తొమ్మిదేళ్లక్రితమే చనిపోయారు. కాలేజీ రోజుల్లో భౌగోళిక రాజకీయాలు, చరిత్ర, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉండేదని ఆమె చెప్పారు. కాలేజీలో డిబేట్‌లలో పాల్గొనే దానినని, సివిల్ సర్వీసెస్ దిశగా అడుగులు వేయాలనే ప్రేరణ ఆ రోజుల్లోనే కలిగిందని వార్దా ఖాన్ వివరించారు.
డిగ్రీ తర్వాత కార్పొరేట్ ఉద్యోగంలో చేరినా సంతృప్తినివ్వలేదని ఆమె చెప్పారు. ఎనిమిది నెలలపాటు ఉద్యోగం చేశానని, అది ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదని వెల్లడించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన, ప్రజల జీవితాల మార్పులో భాగం కావాలనే లక్ష్యం సివిల్స్ సాధించాలనే పట్టుదలను పెంచాయని ఆమె వివరించారు. ఆసక్తికి అనుగుణంగా సివిల్స్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకొని ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పారు.
సివిల్స్ సన్నద్ధతపై మాట్లాడుతూ... ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ అయ్యానని, అయితే ఏడాదిపాటు ఒక ప్రైవేటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నానని ఆమె వివరించారు. లక్ష్మీ కాంత్ రచించిన ఇండియన్ పాలిటీతో ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ను ప్రాథమికంగా ఔత్సాహిక అభ్యర్థులు తప్పనిసరిగా చదవాలని వార్దా ఖాన్ సూచించారు. ప్రాథమిక విషయాలను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆప్షనల్ సబ్జెక్టులు సహా మెయిన్స్ పరీక్షలకు చక్కగా నోట్స్ సిద్ధం చేసుకోవాలని ఆమె చెప్పారు.