USA: విదేశీ గడ్డపై ఉగ్రవాదుల ఏరివేతలో జోక్యం చేసుకోబోం.. అమెరికా సంచలన ప్రకటన
- విదేశాల్లో ఉగ్రవాదులను భారత్ మట్టుబెడుతోందంటూ వస్తున్న ఆరోపణలపై వైఖరిని స్పష్టం చేసిన అమెరికా
- భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చూస్తామని వ్యాఖ్య
- ఇరు దేశాలను చర్చల వైపు ప్రోత్సహిస్తామన్న అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్
ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడబోమంటూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేసే విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదని అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా సంప్రదింపుల దిశగా భారత్, పాకిస్థాన్‌లను ప్రోత్సహిస్తామని అమెరికా తెలిపింది.
ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ విదేశాల్లో ఆపరేషన్లు చేపడుతోందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం ఈ మేరకు మాట్లాడారు. భారత ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల ప్రకటనలను ఏవిధంగా చూస్తారని ప్రశ్నించగా మాథ్యూ మిల్లర్ ఈ విధంగా స్పందించారు.
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్య, ఉగ్రవాదిగా ప్రకటించిన మరో వ్యక్తి పన్నూ (గురుపత్వంత్ సింగ్) హత్యకు న్యూయార్క్‌లో భారత్ ప్రయత్నం, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల హత్య ఆరోపణలను అంతర్జాతీయ మీడియా ప్రస్తావించింది. అయితే ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదని మిల్లర్ స్పష్టం చేశారు.
ఈ విషయంలో భారత్‌పై అమెరికా ఎందుకు ఆంక్షలను పరిగణనలోకి తీసుకోదని ప్రశ్నించగా ఆంక్షలకు సంబంధించిన విషయాన్ని బహిరంగంగా మాట్లాడబోమని మాథ్యూ మిల్లర్ స్పష్టత ఇచ్చారు. ఆంక్షలకు సంబంధించి ఎలాంటి పరిశీలనా చేయడంలేదని, అయితే ఆంక్షలు ఉండబోవని చెప్పడం తన ఉద్దేశం కాదని వ్యాఖ్యానించారు.