Olympics Go Paris 2024: ‘ఒలింపిక్స్ గో ప్యారిస్ 2024’ వీడియో గేమ్‌ను ఆవిష్కరించిన ఐఓసీ
- పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో గేమ్ ఆవిష్కరణ
- జూన్ 11న పీసీ, ఐఓఎస్, యాండ్రాయిడ్ వర్షన్లు ప్రపంచవ్యాప్తంగా విడుదల
- ఒలింపిక్స్ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా గేమ్ డిజైన్
త్వరలో పారిస్‌లో ఒలింపిక్ క్రీడా సంరంభం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ఒలింపిక్స్ గో’ పేరిట ఓ వీడియో గేమ్‌ను తాజాగా ఆవిష్కరించింది. ఒలింపిక్స్లోన వివిధ క్రీడలతో పాటు వివిధ స్టేడియాల చుట్టూ ఓ కొత్త నగరాన్ని నిర్మించే వీలున్న గేమ్‌ను ఐఓసీ సిద్ధం చేసింది. గేమర్స్ ఒక్కో లెవెల్‌ను పూర్తి చేసేకొద్దీ అప్‌గ్రేడ్స్ పాయింట్స్ పొందుతారు. అంతేకాకుండా, క్రీడావేదికల చుట్టూ తమ కలలనగరాన్ని నిర్మించుకునేలా వివిధ ల్యాండ్‌మార్క్స్ కూడా గేమ్‌లో ముందుకెళ్లే కొద్దీ అందుబాటులోకి వస్తాయి.
ఒలింపిక్స్ గో గేమ్..ఈ క్రీడా సంరంభం స్ఫూర్తిని, పారిస్ ఒలింపిక్స్ గొప్పదనాన్ని ప్రతిబింబిస్తుందని ఐఓసీ టెలివిజన్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎలిజబెత్ తెలిపారు. జూన్ 11న ఈ గేమ్ ఐఓఎస్, యాండ్రాయిడ్, పీసీ వర్షన్లు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఎన్వే అనే సంస్థతో కలిసి ఒలింపిక్స్ కమిటీ ఈ గేమ్‌ను తీర్చిదిద్దింది. ఒలింపిక్ సంబంధిత ఉత్పత్తుల ద్వారా ప్రజలను క్రీడలవైపు మరింతగా ఆకర్షించేందుకు ఒలింపిక్స్ కమిటీ గతంలోనూ ఎన్వేతో కలిసి పలు డిజిటల్ ఉత్పత్తులను విడుదల చేసింది. బీజింగ్ ఒలింక్స్ సందర్భంగా ఎన్ఎఫ్టీ డిజిటల్ పిన్స్, ఓ మొబైల్ గేమ్‌ను విడుదల చేసింది.