KCR: ఆ వ్యాఖ్యలపై ఫిర్యాదు... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు
- గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
- కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
- ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను ఈసీ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొంది.
సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రాత్రి ఆయనకు నోటీసులు వచ్చాయి. రేపటిలోగా కేసీఆర్ లీగల్ సెల్ వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సిరిసిల్ల సభలో లత్కోరులు, కుక్కల కొడుకులు అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
కాంగ్రెస్ నేతలపై కూడా బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్‌లపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు.