Ganja Milk Shake: గంజాయితో మిల్క్‌షేక్.. రూటుమార్చిన గంజాయి స్మగ్లర్లు
- మిల్క్ షేక్ రూపంలో గంజాయి
- పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో గంజాయి పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం
- జగద్గిరిగుట్టలో కిరాణాషాపు యజమాని అరెస్ట్
గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని మార్గాలు అన్వేషిస్తున్నా పోలీసులకు పట్టుబడిపోతుండడంతో స్మగ్లర్లు ఈసారి రూటుమార్చారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి పొడి కలుపుకొని మిల్క్‌షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ గంజాయి స్మగ్లర్లు యువతకు నూరిపోస్తున్నారు. ఈ మిల్క్ షేక్ తాగినవారు ఏడు గంటలపాటు మత్తులో జోగుతున్నారు.
రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్వోటీ) పోలీసులు దాడులు చేసి కిరాణ దుకాణం యజమాని మనోజ్‌కుమార్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లయ్ చేసిన మోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయి పొడిని కిలో రూ. 2,500 చొప్పున విక్రయిస్తున్నారు. గంజాయి పొడితో చేసిన చాక్లెట్ ఒక్కో దానిని రూ. 40కి విక్రయిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిత్యం గంజాయి పౌడర్, చాక్లెట్లను ఇక్కడి యువతకు సప్లై చేస్తున్నట్టు గుర్తించారు.