Ricky Ponting: ఐపీఎల్ ట్రోఫీ ఆ జట్టుదేనట.. తేల్చేసిన ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్
- రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు
- ఈసారి భారీ స్కోర్లతో బద్దలవుతున్న రికార్డులు
- బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగిన జట్టే ట్రోఫీ గెలుస్తుందని పాంటింగ్ జోస్యం
ఐపీఎల్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు కొనసాగుతూ ఉత్కంఠను పంచుతున్నాయి. టీ20లోని అసలైన మజాను అభిమానులకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునేది ఎవరన్న ప్రశ్నకు ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అటాకింగ్ బ్యాటింగ్‌ను ఎంచుకునే జట్టే ట్రోఫీని సొంతం చేసుకుంటుందని తేల్చి చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన 31 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందని పేర్కొన్నాడు. 9 మ్యాచుల్లో జట్లు 200, అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు.
ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండుసార్లు నెలకొల్పింది. హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 277/3 పరుగులు చేసి, 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన 263/5 పరుగుల రికార్డును తుడిచిపెట్టేసింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ జట్టు మరోమారు తన రికార్డును తానే బద్దలుగొట్టింది. బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 287/3 పరుగులు చేసింది.
నేడు ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రెండుసార్లు భారీ స్కోర్లు సాధించిందని, కోల్‌కతా జట్టు తమపై 272/7 పరుగులు చేసిందని గుర్తుచేశాడు. జట్ల బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభావం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఈసారి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన జట్టే ట్రోఫీ సాధిస్తుందని స్పష్టం చేశాడు. కాగా, ఢిల్లీ కేపిటల్స్ మాత్రం ఈ సీజన్లో పడుతూ లేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన డీసీ నాలుగింటిలో ఓడి పట్టికలో ఏడో స్థానంలో ఉంది.