Dubai Rains: దుబాయ్ లో ఆకస్మిక వరదలకు కారణం అదేనా...?

Experts says Cloud Seeding may be caused floods in Dubai

  • ఇవాళ దుబాయ్ లో భారీ వరదలు
  • అతలాకుతలమైన ఎడారి రాజ్యం
  • క్లౌడ్ సీడింగ్ వల్లే ఆకస్మిక వర్షాలు, వరదలు అంటున్న నిపుణులు

అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. 

అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ తదితర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. 

తాజాగా, దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్క రోజు వ్యవధిలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడారి దేశాల్లో ఈ స్థాయిలో వర్ష బీభత్సానికి క్లౌడ్ సీడింగ్ కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 విమానాలు, రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి, ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం, అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం, భూగర్భ జలవనరులను పెంపొందించడం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నాయి. ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి, వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 

1982 నుంచి యూఏఈలో కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు జరిగాయి. 2000వ సంవత్సరంలో నాసా, దక్షిణాఫ్రికా పరిశోధక బృందాల సాయంతో యూఏఈ పాలకులు క్లౌడ్ సీడింగ్ ను ముమ్మరం చేశారు. సౌదీ అరేబియా, ఒమన్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటపట్టాయి. 

కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ఒకరకంగా ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనన్నది వాతావరణ పరిశోధకుల మాట. ఒకచోట ఇలా అత్యధిక వర్షపాతాలు కురిపిస్తే, అది మరో చోట అనావృష్టికి దారి తీసి కరవు ఏర్పడుతుందన్న విషయం గమనించాలని, ప్రకృతి వనరుల నియంత్రణలో మానవ జోక్యం తగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మేఘమథనం పేరిట క్లౌడ్ సీడింగ్ నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు.

  • Loading...

More Telugu News