BRS: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు... సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే షకీల్ విజ్ఞప్తి
- తన కుమారుడు రాహిల్‌పై డీసీపీ విజయ్ కుమార్, పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపణ
- తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన
- ఈ కేసులో అసలు తన కొడుకు ప్రమేయమే లేదని వ్యాఖ్య
- కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్
తన కొడుకు తప్పు చేసినట్లు నిరూపితమైతే చట్టపరంగా ఉరితీయవచ్చునని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. కేసును పారదర్శకంగా విచారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసుపై ఆయన స్పందించారు. తన కుమారుడు రాహిల్‌పై డీసీపీ విజయ్ కుమార్, పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వాపోయారు. ఈ కేసులో అసలు తన కొడుకు ప్రమేయమే లేదన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనపై రాజకీయ కక్ష ఉంటే తనతో చూసుకోవాలన్నారు. అంతేకానీ తన కొడుకును ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తన ఆరోగ్యం బాగాలేకపోయినా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. తన కుమారుడికి ఏదైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.