India In UNSC: భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. ఎలాన్ మస్క్ సూచనపై అమెరికా స్పందన

US responds after Elon Musk advocates Indias permanent seat in UNSC

  • ఐక్యరాజ్య సమితి వ్యవస్థల్లో సంస్కరణల అవసరం ఉందన్న అమెరికా
  • 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలని వ్యాఖ్య
  • అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని గతంలోనే ప్రస్తావించారన్న అమెరికా విదేశాంగ శాఖ 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సూచనపై అమెరికా తాజాగా స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని వ్యాఖ్యానించింది. తాజా మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 

‘‘అమెరికా అధ్యక్షుడు ఈ విషయమై గతంలో మాట్లాడారు. అమెరికా విదేశాంగ మంత్రి కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. భద్రతామండలి సహా ఐక్యరాజ్య సమితి వ్యవస్థల్లో 21వ శతాబ్దపు మార్పులను ప్రతిబింబించేలా సంస్కరణలకు మేము మద్దతు ఇస్తున్నాం. ఈ దిశగా తీసుకునే చర్యలపై ప్రస్తుతం నా వద్ద పూర్తి వివరాలు లేవు. అయితే, సంస్కరణల అవసరాన్ని మాత్రం అమెరికా గుర్తించింది’’ అని వేదాంత్ పటేల్ అన్నారు. 

అసలు మస్క్ ఏమన్నారంటే..
భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యకరమని ఎలాన్ మస్క్ జనవరిలో వ్యాఖ్యానించారు. బలమైన దేశాలు తమ అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా లేవని వ్యాఖ్యానించారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడో ఒకప్పుడు సంస్కరణలు చేయకతప్పదు. సమస్య ఏంటంటే.. ప్రస్తుతం అధికారాలను అనుభవిస్తున్న దేశాలు వాటిని వదులుకోదలుచుకోలేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం వింతే. యావత్ ఆఫ్రికా ఖండానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి’’ అన్నారాయన. 

కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు మరింత మెరుగ్గా ప్రాతినిధ్యం వహించేందుకు తమకు భద్రతామండలి శాశ్వత సభ్యత్వం ఉండాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ వాదనకు అంతర్జాతీయంగా కూడా మద్దతు పెరుగుతోందని ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా వ్యాఖ్యానించారు. మనకు కావాల్సినవి ప్రపంచం ఉదారంగా దానం చేయదని, వాటి కోసం పోరాడి తీసుకోవాల్సి వస్తుందని కూడా అన్నారు. 

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు కాగా, మిగతా పది దేశాలను ఐక్యరాజ్య సమితి జనరల్ ఎసెంబ్లీ.. రెండేళ్ల కాలపరిమితి చొప్పున భద్రతామండలికి ఎన్నుకుంటుంది. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, బ్రిటన్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది.

  • Loading...

More Telugu News