Alia Bhatt: ‘టైమ్స్’ ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల టాప్-100 జాబితాలో అలియా భట్

Alia Bhatt and Sakshi Malik and Satya Nadella Among TIMEs 100 Most Influential
  • ఒలింపియన్ సాక్షి మాలిక్, సత్య నాదెళ్లకు చోటు
  • జాబితాలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, నటుడు దేవ్ పటేల్‌
  • 2024 జాబితాను విడుదల చేసిన ‘టైమ్స్ మ్యాగజైన్’
ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ 2024’ ప్రపంచ ప్రభావశీల టాప్-100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయులు నిలిచారు. టైమ్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసిన ఈ జాబితాలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, బాలీవుడ్ నటి అలియా భట్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు-దర్శకుడు దేవ్ పటేల్‌ చోటు దక్కించుకున్నారు. 

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ లోన్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్‌ షా, యేల్‌ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ, ఫిజిక్స్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్న ప్రియంవదా నటరాజన్‌, భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని అస్మా ఖాన్‌, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ భార్య యులియా ఈ జాబితాలో నిలిచారు.

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రొఫైల్‌ను యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ వివరించారు. సవాళ్లతో కూడుకున్న అత్యంత ముఖ్యమైన సంస్థను మార్చే నైపుణ్యం, ఉత్సాహం కలిగిన వ్యక్తిని గుర్తించడం అంత సులభమైన పనికాదని, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అజయ్ బంగా ఆ పనిని చేసి చూపిస్తున్నారని యెల్లెన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్లు లేని లక్షలాది మందిని డిజిటల్ ఎకానమీలోకి తీసుకువచ్చారని కొనియాడారు. పేదరికం లేని ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.

అలియా భట్‌ ప్రొఫైల్‌ని దర్శకుడు, నిర్మాత, రచయిత అయిన టామ్ హార్పర్ వివరించారు. అలియా భట్ ను ప్రతిభ కలిగిన మహిళగా అభివర్ణించారు. ఆమె ప్రపంచ ప్రముఖ నటులలో ఒకరుగా మాత్రమే కాదని, ఆమె ఒక వ్యాపారవేత్త, నిజాయతీ కలిగిన పరోపకారి అని టామ్ హార్పర్ పేర్కొన్నారు. 

ఇక ‘మన భవిష్యత్తును రూపొందించడంలో ప్రభావిత వ్యక్తి’ అని సత్య నాదెళ్లను టైమ్స్ కొనియాడింది. మరోవైపు సాక్షి మాలిక్‌‌ కూడా అత్యంత ప్రభావశీల వ్యక్తి అని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది.
Alia Bhatt
Sakshi Malik
Satya Nadella
TIMEs 100 Most Influential

More Telugu News