Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో తన పాత్రపై క్లారిటీ కోరిన విరాట్ కోహ్లీ.. బీసీసీఐ సమాధానం ఇదే!
- ఓపెనర్ పాత్ర పోషించాలని కోహ్లీని కోరిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ
- ఐపీఎల్‌లో జైస్వాల్ ఇబ్బందులు పడుతుండడంతో అనుభవజ్ఞుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం!
- కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో బీసీసీఐ పెద్దల కీలక సమావేశం
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోయే జట్టుని ప్రకటించడానికి ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఏయే ఆటగాళ్లకు చోటు దక్కుతుంది?. అనూహ్యమైన మార్పులు ఏమైనా ఉంటాయా? అనే చర్చ నడుస్తున్న వేళ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో బీసీసీఐ పెద్దలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగిన ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో సహా పలు అంశాలపై చర్చించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందనే విమర్శలు.. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, బౌలింగ్ కూడా అప్పుడప్పుడు కొన్ని స్పెల్స్ మాత్రమే వేస్తున్నాడనే విమర్శల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో తన పాత్రపై క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని విరాట్ కోహ్లీ కోరినట్టు సమాచారం. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా వ్యవహరించాలని కోహ్లీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఐపీఎల్‌లో పెద్ద స్కోర్లు చేయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో కోహ్లీతో ఇన్నింగ్స్ ఆరంభించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీ ఓపెనర్‌గానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా కూడా కోహ్లీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అనుభవజ్ఞుడైన కోహ్లీకి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడం మేలు అని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
ఇక బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్‌ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్, శివమ్ దూబేతో పాటు రియాన్ పరాగ్‌ను బీసీసీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.