Hugging Tree: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బెంగళూరు కంపెనీ యాడ్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
- ప్రకృతిలో గడపాలని తపించిపోయే వారే లక్ష్యంగా ప్రకటన
- తమ వద్ద చెట్లను కౌగిలించుకోవచ్చంటూ కంపెనీ యాడ్
- అందుకు రూ. 1500 చెల్లించాల్సి ఉంటుందన్న కంపెనీ
- మార్కెట్లో మరో స్కామ్ అందుబాటులో ఉందన్న నెటిజన్లు
- ఉచితంగా దొరికే దాన్ని కూడా వ్యాపారం చేస్తారా? అంటూ మండిపాటు
ప్రకృతికి, మానవుడికి విడదీయరాని సంబంధం ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం ఎన్నో ఒత్తిళ్ల మధ్య జీవనం కొనసాగిస్తున్న సగటు మానవుడు కాస్తంత సమయం దొరికితే ప్రకృతి ఒడిలో సేద దీరాలని భావిస్తుంటాడు. ప్రకృతితో మమేకం కావడం వల్ల మానసిక ప్రశాంతతే కాదు, నూతనోత్సాహం కూడా లభిస్తుంది. సవాళ్లు, భావోద్వేగాలను ఎదుర్కోవడంలోనూ ప్రకృతిది ఎనలేని పాత్ర.
పరిసరాల్లో పచ్చని చెట్టు కూడా కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి చెంత గడపడమనేది అసాధ్యంగా మారింది. నగరాలు, పట్టణాల్లోని పార్కులు కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ ప్రకృతిలో ఉన్నామన్న భావనను అవి ఇవ్వలేవు. జపాన్‌లో ఇలాంటి వారి కోసం షిన్రిన్ యోకు అనే ఫారెస్ట్ బాత్ (అటవీ స్నానం) ఉంది. దట్టమైన అడవుల్లో అడుగులో అడుగేసుకుంటూ నడవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుందని వారు నమ్ముతారు.
మన అసలు విషయానికి వస్తే బెంగళూరు కంపెనీ ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో దున్నేస్తోంది. అంతేకాదు, అది వివాదానికీ కారణమైంది. ఇంతకీ ఆ కంపెనీ యాడ్ ఏంటంటే.. కేవలం రూ. 1500 చెల్లించడం ద్వారా ఈ కంపెనీ గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలను అందిస్తుంది. అందులో భాగంగా చెట్లను హగ్ (కౌగిలించుకోవడం) చేసుకోవచ్చు. ఈ యాడ్ సోషల్ మీడియా యూజర్లకు ఆగ్రహం తెప్పించింది.
యాడ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండే పద్ధతిని వ్యాపారం కోసం వాడుకోవడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌పై ఓ యూజర్ మండిపడుతూ.. అందరూ ‘మేల్కొనండి.. మార్కెట్లో కొత్త స్కామ్ రెడీగా ఉంది’ అని హెచ్చరించాడు. చెట్లను కౌగిలించుకోవడం ద్వారా ప్రకృతిలో గడపడం మంచిదే అయినా, అందరికీ అందుబాటులో ఉండే దానిని రూ. 1500కు అమ్ముకోవడం దారుణమంటూ మరికొందరు దుమ్మెత్తి పోశారు. అత్యంత చికిత్సా విధానం ఏంటంటే పార్కుకు వెళ్లడం, చుట్టూ చెత్తవేయకుండా ఉండడం, చెత్తను సరిగ్గా చెత్తకుప్పలో పారవేయడం అని మరో యూజర్ రాసుకొచ్చాడు.