Hardik Pandya: హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా
- స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధింపు
- గత రాత్రి పంజాబ్‌పై మ్యాచ్‌లో ఐపీఎల్ నియమావళి అతిక్రమణ
- తొలిసారి అతిక్రమించడంతో రూ.12 లక్షలతో సరిపెట్టిన బీసీసీఐ
గురువారం రాత్రి చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఉత్కంఠభరిత పోరులో 9 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు ఏకంగా జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఈ భారీ ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించినట్టు బీసీసీఐ ప్రకటించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
‘‘ కనీస ఓవర్ రేట్ అతిక్రమణలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం జరిమానా విధిస్తున్నాం. ఈ సీజన్‌లో ముంబై జట్టు చేసిన మొదటి నేరం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించాం’’ అని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ విజయాల బాటపట్టింది. ఈ సీజన్‌లో మూడవ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని కాస్త మెరుగుపరచుకుంది.