Meghalaya: త్వరగా ఓటు వేయాలని 6.30 గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లిన మేఘాలయ సీఎం.. అప్పటికే భారీ క్యూ
- 6.30 గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా
- అప్పటికే ఓటర్లు పోటెత్తడంతో క్యూలైన్లో నిలబడిన సీఎం
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ఎన్పీపీ అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరుతున్న ఓటింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో చాలామంది ఉదయాన్నే ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉదయం 7 గంటలకే కనిపించిన భారీ క్యూలైన్లే ఇందుకు నిదర్శనం.
మేఘాలయ సీఎం, అధికార పార్టీ ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) అధ్యక్షుడు కన్రాడ్ సంగ్మా కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్‌కు వెళ్లారు. వీలైనంత త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో పోలింగ్ ఆరంభానికి అరగంట ముందు 6.30 గంటలకే బూత్‌కు వెళ్లారు. కానీ అప్పటికే పెద్ద సంఖ్యలో బారులు తీరిన ఓటర్లను చూసి ఆయన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. భారీ క్యూలైన్ కట్టారు. దీంతో చేసేదేమీలేక సీఎం సంగ్మా క్యూలైన్ లో నిలబడ్డారు. క్యూలైన్లో తన వంతు వచ్చాక ఓటు వేశారు. రాష్ట్రంలోని తురా లోక్‌సభ స్థానంలోని వాల్బాక్గ్రే పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ‘‘ ముందుగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఉదయం 6.30 గంటలకే బూత్‌కు వెళ్లాను. కానీ నా కంటే ముందు చాలా మంది రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది చాలా చక్కటి ధోరణి. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు’’ అని సంగ్మా వ్యాఖ్యానించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని, ప్రజాస్వామిక హక్కులను ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా మేఘాలయలోని తురా, షిల్లాంగ్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.