Jagga Reddy: కేసీఆర్ బయటకు వస్తే మా అస్త్రాలు బయటకు తీస్తాం: జగ్గారెడ్డి
- తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
- కేసీఆర్ మాటలకు తాము అగస్ట్‌లో సమాధానం చెబుతామన్న జగ్గారెడ్డి
- అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్య
- బీఆర్ఎస్‌లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా
- తమ పార్టీలో లీడర్లకు కొదవలేదన్న కాంగ్రెస్ నేత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆయన మాటలకు తాము అగస్ట్‌లో సమాధానం చెబుతామన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు. రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి, వీహెచ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు... ఇలా తమ పార్టీలో అందరూ తోపులు... బ్రిలియంట్స్ ఉన్నారన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని విమర్శించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు నిద్రపట్టడం లేదన్నారు. తామే దేశభక్తులమని బీజేపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డూప్లికేట్ బీజేపీ నేతలే డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలని చురక అంటించారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పస లేదన్నారు.