supreme court: భూమి మనిషికి చెందదు.. అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

Earth does not belong to man forests must be protected at all cost

  • వరంగల్ జిల్లాలో అటవీ భూమిని కొట్టేయాలనుకున్న ఓ వ్యక్తి కేసులో కీలక తీర్పు
  • సరైన వైఖరి తీసుకోనందుకు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 5 లక్షల జరిమానా
  • పర్యావరణ పరిరక్షణ, పౌరుల జీవించే హక్కుకు మధ్య నేరుగా సంబంధం ఉందని వ్యాఖ్య

పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని, ప్రపంచాన్ని వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు అడవులను రక్షించాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న కొంపల్లి గ్రామంలో 1980ల నుంచి అటవీ భూమిని సొంత భూమిగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తితో కలసి అధికారులు కుమ్మక్కు కావడంపై మండిపడింది. ఈ విషయంలో  విరుద్ధమైన వైఖరి తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

రెండు నెలల వ్యవధిలో రెండో తీర్పు..
ఈ విషయంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లిన జడ్జి సరైన తీర్పు ఇవ్వగా దాన్ని రాష్ర్ట విభజన అనంతరం తెలంగాణ హైకోర్టుకు చెందిన జడ్జి కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ సందర్భంగా 1854లో ఓ గిరిజన తెగ పెద్ద నాటి అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. 

“భూమి మనిషికి చెందదు. మనిషే భూమికి చెందిన వాడు” అంటూ ఆ లేఖలో గిరిజన తెగ పెద్ద పేర్కొనడాన్ని గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జీ) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, అడవి జంతువులతో కూడిన సహజ పర్యావరణాన్ని కాపాడటం, మెరుగుపరచడం పౌరుల ప్రాథమిక బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణను ప్రాథమిక హక్కులకు సమాన స్థాయిలో పోలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం గత రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. అంతరించి పోయే దశలో ఉన్న బట్టమేక పిట్ట పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గత నెల పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేస్తూ తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News