MS Dhoni: ధోని బ్యాటింగ్ కు వస్తుంటే దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్ వాచ్ లో వార్నింగ్
- తాత్కాలిక వినికిడి లోపం తలెత్తే ముప్పుందని హెచ్చరిక
- శబ్దాల తీవ్రత 95 డెసిబిల్స్ కు చేరిందని క్రికెటర్ డికాక్ భార్య వెల్లడి
- తన వాచ్ లో వార్నింగ్ అలర్ట్ ను ఫొటో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన శాషా
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి, ఆయన ఆటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ధోనీని చూడడానికి వందల కిలోమీటర్లు అష్టకష్టాలు పడి స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. అలాంటి ఆటగాడు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడుతుంటే స్టేడియం హోరెత్తిపోవడంలో ఆశ్చర్యమేముంటుంది?.. శుక్రవారం కూడా ఇలాగే స్టేడియం దద్దరిల్లిపోయింది. ధోనీ ధోనీ అంటూ అభిమానులు నినాదాలు చేయడంతో స్టేడియంలో శబ్ద తీవ్రత 95 డెసిబిల్స్ దాటిందని, దీంతో తన యాపిల్ వాచ్ అలర్ట్ చేసిందని సౌతాఫ్రికా ఆటగాడు డీ కాక్ భార్య శాషా చెప్పారు. దీనికి సంబంధించి శాషా ఓ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. శబ్ద తీవ్రత ఓ పది నిమిషాలు అలాగే కొనసాగితే తాత్కాలికంగా వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని యాపిల్ వాచ్ హెచ్చరించిందని తెలిపారు.
లఖ్ నవూలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన శాషా.. ధోనీ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారు. సీఎస్కే తరఫున చివరి ఓవర్లలో ధోనీ బ్యాటింగ్ కు వస్తుంటే ఏకనా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పారు. ధోనీ ధోనీ అంటూ అభిమానుల అరుపులతో శబ్ద తీవ్రత పీక్ కు వెళ్లిపోయిందన్నారు.