Elon Musk: ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
- టెస్లా బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్లేనంటూ ‘ఎక్స్’లో పోస్ట్
- ఈ ఏడాదిలోగా భారత్ లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
- ఇండియాలో టెస్లా విద్యుత్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు ప్రకటనకు తప్పని నిరీక్షణ
ప్రపంచ కుబేరుడు, విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శనివారం తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. టెస్లా బాధ్యతలు విపరీతంగా ఉండటమే తన భారత పర్యటన వాయిదాకు కారణమని ఆయన పేర్కొన్నారు. “దురదృష్టవశాత్తూ, టెస్లా బాధ్యతలు అధికం కావడం నా భారత పర్యటన వాయిదాకు దారితీశాయి. కానీ నేను ఈ ఏడాదిలోగా భారత్ లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నా” అని మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
అందరి చూపు టెస్లా ప్లాంట్ ప్రకటనపైనే..
మస్క్ ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా మస్క్.. భారత్ లో టెస్లా విద్యుత్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు ప్రకటన చేయొచ్చు. భారత్ లో ప్లాంట్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్న మస్క్ తన ప్రాజెక్టును ఈ పర్యటనలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా టెస్లా కనీసం 2–3 వందల కోట్ల డాలర్ల మేర పెట్టుబడి పెట్టి ప్రాథమిక స్థాయి విద్యుత్ కార్లను తయారు చేయొచ్చు. వీటి ధర సుమారు రూ. 25 లక్షలు ఉండొచ్చని అంచనా. ఈ కార్లను మోడల్ 2గా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కార్ల తయారీకి సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ సేవల అనుమతుల కోసం నిరీక్షణ
అలాగే తన పర్యటనలో భాగంగా మస్క్ వివిధ అంతరిక్ష స్టార్టప్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్ లతో ఢిల్లీలో సమావేశం కావొచ్చు. భారత్ లో తన స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం మస్క్ ఎదురుచూస్తున్నారు. తన భారత పర్యటనను, ప్రధాని మోదీతో సమావేశం కానున్న విషయాన్ని మస్క్ గతంలోనే ధ్రువీకరించారు. “భారత్ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా” అంటూ ‘ఎక్స్’లో ఇటీవల పోస్ట్ చేశారు. గతంలో ట్విట్టర్ పేరుతో కొనసాగిన ప్రస్తుత ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఆయనదే.