Deve Gowda: అవును! నేను బీజేపీ బీటీం లీడర్‌నే.. అయితే ఏంటి?.. రాహుల్‌ను ప్రశ్నించిన దేవెగౌడ

JDS President Deve Gowda Reacts Rahul Gandhi B Team Comments

  • రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన దేవెగౌడ
  • లోక్‌సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని వ్యాఖ్యలు
  • మోదీ 400 సీట్లు గెలుకుంటారని జోస్యం

‘‘అవును.. నేను బీజేపీ బీ టీం నాయకుడినే.. అయితే ఏంటి?’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఇటీవల పర్యటించిన రాహుల్‌గాంధీ మాట్లాడుతూ దేవెగౌడపై తీవ్ర విమర్శలు చేశారు. జేడీఎస్ గతంలో బీజేపీకి బీ టీంగా ఉండేదని, ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారని విమర్శించారు. ఈ విమర్శలపై దేవెగౌడ ఘాటుగా స్పందించారు. 

కోలార్ పార్లమెంట్ బరిలో నిలిచిన ఎన్డీయే అభ్యర్థి మల్లేశ్‌బాబుకు మద్దతుగా నిన్న ప్రచారం చేసిన దేవెగౌడ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఆ పార్టీని గెలిపించారని, ఇప్పుడు బెంగళూరులో తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి తాగునీరు ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ మంజూరు చేసిన ఎట్టినహోలె ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ ప్రాజెక్టు కోసం వేసిన పైపులు తుప్పు పట్టిపోతున్నాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రస్తుతం తన వయసు 93 సంవత్సరాలని, 2014లో మోదీని సవాలు చేసి ఓడిపోయానని దేవెగౌడ గుర్తుచేసుకున్నారు. అప్పుడు తాను రాజీనామా చేస్తానంటే తనలాంటి సీనియర్ నేత పార్లమెంటులో ఉండాల్సిందేనని మోదీ పట్టుబట్టారని చెప్పారు. ఈసారి మోదీ 400 సీట్లు గెలుచుకుంటారని దేవెగౌడ ధీమా వ్యక్తంచేశారు.

  • Loading...

More Telugu News