DK Aruna: పండబెట్టి తొక్కుతావా... ఓ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి?: రేవంత్ రెడ్డిపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం
- ఓడిపోతామనే భయంతోనే నామినేషన్ ప్రక్రియకు సీఎం వచ్చారన్న డీకే అరుణ
- ఏది మాట్లాడినా కేసీఆర్‌లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటున్నావా? అని ఆగ్రహం
- ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన చరిత్ర నీదంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు
- రేవంత్ రెడ్డి పదేళ్ల కిందటి వ్యక్తిగా వ్యవహరిస్తే సీఎం పదవికే అవమానకరమని వ్యాఖ్య
నిన్న మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో తనపై విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ సవాల్ విసిరారు. తాను మహిళ అనే ఇంగితజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడారని మండిపడ్డారు. 'మమ్మల్ని పండబెట్టి తొక్కుతాడంట అయన. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ల అభ్యర్థిని గెలిపించుకుంటాడట. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి. పండబెట్టి తొక్కుతావా... ఎక్కడికి వస్తావో రా.. తొక్కుదువు రా' అని ఆమె మండిపడ్డారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి తొలిసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని... కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయం వారికి పట్టుకుందని, అందుకే నామినేషన్ కోసం సీఎం వచ్చారన్నారు.
'ఏది మాట్లాడినా కేసీఆర్‌లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటున్నావా? ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన చరిత్ర నీది. నా బాగోతంపై చర్చించేందుకు నేను సిద్దం.. మీరు సిద్దమా?' అని సవాల్ చేశారు. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారన్నారు. వాళ్లు కనీసం సోయిలేకుండా రాక్షసుల్లా, రాబంధవుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పదేళ్ల కిందటి వ్యక్తిగా వ్యవహరిస్తే సీఎం పదవికే అవమానకరన్నారు. సేవ అంటే సీఎంకు అర్థం తెలుసా? అని నిలదీశారు. ఓ మహిళను అవమానించేలా మాట్లాడుతారా? నన్ను పండబెట్టి తొక్కుతారా? అని ప్రశ్నించారు.