H5N1: మొదటిసారిగా ఆవు పాలలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్... డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి
- ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్ విజృంభణ
- ఆవు పాలలో వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. మొదటిసారిగా ఆవు పాలలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్, కాన్సాస్, మిషిగాన్, న్యూ మెక్సికో, ఇడాహో, ఒహాయో, నార్త్ కరోలినా రాష్ట్రాల్లోని 13 పశువుల మందల్లో బర్డ్ ఫ్లూ ప్రబలినట్టు గుర్తించారు.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. పచ్చి పాలలోనే ఈ వైరస్ ఉన్నట్టు గుర్తించగా, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నిర్మూలించబడుతుందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
బర్డ్ ఫ్లూ కారక హెచ్5ఎన్1 వైరస్ 1996లో తొలిసారిగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి బర్డ్ ఫ్లూ తీవ్రత అధికమైంది. లక్షలాది పక్షులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. అయితే మనుషులు, పిల్లులు, ఎలుగుబంట్లు, నక్కలు, పెంగ్విన్లు, మింక్స్ వంటి జీవుల్లోనూ ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుండడం కలవరపరుస్తోంది.
ఆవులు, మేకలను బర్డ్ ఫ్లూ ఏమీ చేయదనే భావన గతంలో ఉండేది. అయితే ఇటీవల పరిణామాలతో బర్డ్ ఫ్లూ బాధిత జీవుల్లో ఆవులు, మేకలను కూడా చేర్చారు.