Revanth Reddy: తెలంగాణ సీఎంగా చెబుతున్నా... ఉదయనిధి స్టాలిన్ లాంటి వారిని శిక్షించాలి: 'సనాతన' వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి
- టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై రేవంత్ స్పందన
- ఉదయనిధి వ్యాఖ్యలు సరికాదు... ఆ మాటలు తప్పే.. ఎవరూ సమర్థించరన్న రేవంత్ రెడ్డి
- ఒకే కుటుంబంలో భిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఉంటారని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఉదయనిది గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. 'టైమ్స్ నౌ' ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా... 'ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు. ఆ మాటలు తప్పు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరైనా సమర్థిస్తారా? ఉదయనిధి స్టాలిన్ చేసింది కరెక్ట్ అని చెప్పగలరా?' అని రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వారు బాధ్యత వహించాల్సిందే అన్నారు. 'నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఆయన (ఉదయనిధి) లాంటి వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు.
డీఎంకేతో పొత్తు గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా... ఒకే కుటుంబంలో కూడా భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఉంటారన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.