Heat Wave: ఏపీలో తీవ్ర వడగాడ్పులు... ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1 డిగ్రీల వేడిమి
- నిప్పుల కుంపటిలా ఏపీ
- చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
- ఇవాళ 29 ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు, 72 ప్రాంతాల్లో వడగాడ్పులు
ఏపీలో ఏప్రిల్ నాటికే ఎండలు మండిపోతున్నాయి. అనేక జిల్లాల్లో వడగాడ్పులతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
మన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9 డిగ్రీలు వేడిమి నమోదైంది. చిత్తూరు జిల్లా నిండ్రలో 43.6, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.4, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 43.3, నంద్యాల జిల్లా గోస్పాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా నేడు 29 మండలాల్లో తీవ్ర వడగాడ్పులతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రాష్ట్రంలో 72 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.