Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు ఊపిరితిత్తుల్లో నెమ్ము... అభిమానులకు జాగ్రత్తలు చెప్పిన జనసేన పార్టీ
- ఇటీవల తరచుగా అనారోగ్యం బారినపడుతున్న జనసేనాని
- కొన్ని రోజుల కిందట తీవ్ర జ్వరంతో హైదరాబాద్ వెళ్లిపోయిన పవన్
- మళ్లీ వచ్చి చంద్రబాబుతో ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం
- ఇప్పటికీ పవన్ అస్వస్థతతో బాధపడుతున్నారన్న జనసేన పార్టీ
- ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో జ్వరం వస్తోందని వెల్లడి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. మొన్న వరుసగా రెండ్రోజుల పాటు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన తీవ్ర జ్వరం కారణంగా వెంటనే హైదరాబాదు వెళ్లిపోయారు. మళ్లీ ఇటీవలే పిఠాపురం వచ్చి, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉమ్మడి ప్రచార సభల్లో పాల్గొన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ నేడు కీలక ప్రకటన చేసింది. రికరెంట్ ఇన్ ఫ్లుయెంజా కారణంగా పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ముతో బాధపడుతున్నారని, ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఆయనకు జ్వరం వస్తోందని వెల్లడించింది. ఈ సందర్భంగా పవన్ పర్యటనల సందర్భంగా అభిమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనసేన పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
"పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు వేయవద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము" అని పేర్కొంది.