Chandrababu: వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు
- తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజాగళం సభ
- పవన్ గురించి జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడన్న చంద్రబాబు
- పవన్ పెళ్లాల గురించి నీకెందుకు అంటూ ఫైర్
- నువ్వు పవన్ కాలిగోటికి కూడా సరిపోవంటూ విమర్శలు
- రాజకీయాలు లేకపోతే జగన్ పైసాకి కూడా చెల్లడని వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... నీ తాత జాగీరు అని రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నావా? నువ్వు దోచుకుంటే ప్రశ్నించకూడదా? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరారవుతారు వీళ్లు... ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
"అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడతారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిడతాడో వాడికి మంత్రి పదవి! ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషన్! నా మీద దాడి చేయించిన వాడికి ఒక మంత్రి పదవి! నా మిత్రుడు పవన్ కల్యాణ్ పై దాడి చూశారా? పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకంత కడుపుమంట? ఒక నీతి నిజాయతీతో రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఏర్పడాలని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? రాష్ట్రమంతా దోచేసిన నువ్వా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేది? నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు.
ఇవాళ పవన్ ఒక సినిమాలో నటిస్తే డబ్బులు ఇస్తారు... సూపర్ స్టార్ ఆయన! రాజకీయాలు లేకపోతే ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక్క నయా పైసాకు పనికొస్తాడా? ఏదైనా ఒక్క పని చేసే సత్తా ఉందా నీకు?
నువ్వు ఆయన పెళ్లాల గురించి మాట్లాడతావా? అందుకే ఆయన అన్నాడు... ఓకే, నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. సిగ్గున్న వాడైతే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతాడా? అందుకే అంటున్నా... వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది" అంటూ చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవాళ పవన్ కల్యాణ్ రాజానగరం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సీఎం జగన్ నిన్న కాకినాడ సభలో మాట్లాడుతూ, ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి అని వ్యంగ్యం ప్రదర్శించారు.
ఈ వ్యాఖ్యలకు పవన్ ఇవాళ బదులిచ్చారు. "పరదాల మహారాణీ... నిన్న నాతో చాలామంది చెప్పారు. సార్ నిన్న మీ నాలుగో పెళ్లానికి చాలా అవమానం జరిగిందని చెప్పారు. నువ్వు నా గురించి పెళ్లాం అని మరోసారి మాట్లాడితే, జగన్ నా నాలుగో పెళ్లాం అని జనాలు మాట్లాడతారు జాగ్రత్త!" అంటూ వార్నింగ్ ఇచ్చారు.