CM Ramesh: జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం: మెగాస్టార్ చిరంజీవి
- తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాలు మాట్లాడుతున్నానన్న మెగాస్టార్
- అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని కోరిన చిరంజీవి
- చిరంజీవిని ఆయన నివాసంలో కలిసిన ఇరువురు నేతలు
ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. అనకాపల్లి లోక్‌సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు.
సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. ‘‘ తమ్ముడు పవన్ కల్యాణ్ కారణంగా చాలా కాలం తర్వాత రాజకీయల గురించి మాట్లాడుతున్నాను. పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఇది శుభపరిణామం. సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ నాకు కావాల్సిన ఇద్దరూ అనకాపల్లి లోక్‌సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొకరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్థులు. నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని అన్నారు.
‘‘కేంద్రంతో సీఎం రమేశ్‌కి ఉన్న పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ స్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. తద్వారా పంచకర్ల రమేశ్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కోరుకునే అభివృద్ధి పనులు సజావుగా సాగిపోతాయి. మీ అందరి ఆశీస్సులు వీరిపై ఉంటాయని నమ్ముతున్నాను. దయచేసి వీరిద్దరిని గెలిపించండి. నాదో పెద్ద కోరిక. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలి. దానికి మీరందరూ నడుం బిగించండి. ఇలాంటివారికి ఓటు వేసి గెలిపించి మీ ఆశీస్సులు అన్ని విధాలుగా వీరికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలిగించండి’’ అని చిరంజీవి అన్నారు. పంచకర్ల రమేశ్ రాజకీయంగా తన దీవెనలతోనే రాజకీయ అరంగేట్రం చేశారని చిరంజీవి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నా తనతో మాట్లాడుతూనే ఉంటారని వెల్లడించారు.