karate: పాక్, భారత్ జెండాలు పట్టుకున్న ఆటగాడు.. ఇంటర్నెట్ ఫిదా!
- ఇరు దేశాల మధ్య హోరాహోరీగా కరాటే పోటీ
- చివరకు 2–1 తేడాతో గెలిచిన దాయాది జట్టు
- పాక్ ఆటగాడి తీరును ప్రశంసిస్తున్న నెటిజన్లు
క్రీడా వేదికలపై భారత్–పాక్ మధ్య పోరు అరుదైనదే.. కానీ ఒకవేళ ముఖాముఖి తలపడితే మాత్రం ఉత్కంఠ పోటీ తథ్యం. అలాంటి పరిస్థితే తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన కరాటే పోటీలో కనిపించింది. భారత్ కు చెందిన రాణాసింగ్, పాకిస్థాన్ కు చెందిన షజేబ్ రింద్ శనివారం కరాటే పోటీలో తలపడ్డారు. ఆద్యంతం నువ్వా, నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో చివరకు పాక్ ఆటగాడు విజయం సాధించాడు. 2–1 పాయింట్ల తేడాతో పాక్ జట్టు గెలుపొందింది.
చెరో మ్యాచ్ గెలిచాక..
తొలి మ్యాచ్ లో పాక్ కు చెందిన రిజ్వాన్ అలీ గెలవగా రెండో మ్యాచ్ లో భారత్ కు చెందిన హిమాన్షు కౌషిక్ గెలిచాడు. దీంతో మూడో మ్యాచ్ అందరిలో ఉత్కంఠ రేపింది. అయితే చివరకు పాక్ ఆటగాడు షజేబ్ రింద్ ను విజయం వరించింది. కానీ ఈ ఆటకన్నా కూడా షజేబ్ వ్యవహరించిన తీరు అందరి మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. మ్యాచ్ గెలిచిన వెంటనే షజేబ్ పాక్ జెండాతోపాటు భారత్ జెండాను కూడా చేతిలోకి తీసుకున్నాడు. ఇందుకు గల కారణం ఏమిటని మ్యాచ్ ప్రెజెంటర్ ప్రశ్నించగా అతను భావోద్వేగపూరిత సమాధానం ఇచ్చాడు.
మేం శత్రువులం కాదు..
“ఈ పోరు శాంతి స్థాపన కోసం జరిగింది. మేం శత్రువులం కాదు.. మేం కలిసే ఉన్నాం. కలిసుంటే మనం ఏదైనా చేయొచ్చు. పాక్, భారత్ మధ్య స్నేహం, సన్నిహిత సంబంధాల కోసమే ఈ పోరు” అని షజేబ్ బదులిచ్చాడు. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు షజేబ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. “అతను నా సూపర్ స్టార్. నా చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తున్నా. మీ సమక్షంలో పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు” అని షజేబ్ చెప్పాడు. అనంతరం సల్మాన్ తో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతని ఆటతీరును సల్మాన్ ప్రశంసించాడు. ఇరు దేశాల క్రీడాభిమానులు షజేబ్ ఆటను, అతను వ్యవహరించిన తీరును సోషల్ మీడియాలో తెగ పొగిడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.