Raghunandan Rao: రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలి: రఘునందన్ రావు
- ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడతామంటే సరికాదన్న రఘునందన్ రావు
- తెలంగాణకు హాని చేసేవాళ్లను ఉపేక్షించబోమని స్పష్టీకరణ
- తానేం మాట్లాడుతున్నాడో రేవంత్ రెడ్డికి అర్థం కావడంలేదని విమర్శలు
ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడతామంటే సరికాదని బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముదిరాజ్ లకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు.
కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి, తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడంలేదని విమర్శించారు. ఆదిలాబాద్ లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా హామీలు అమలు జరగలేదని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. రైతుల రుణమాఫీకి, ఆగస్టు నెలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
దానం నాగేందర్ గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు పదవి అనుభవించారని, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈసారి 10 కంటే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలుస్తామని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇక, మాజీ సీఎం కేసీఆర్ పై కూడా రఘునందన్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అంటే ఆర్భాటం, ఆరంభం, అంతం అని అభివర్ణించారు. తొలుత టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు.. తర్వాత దాన్ని బీఆర్ఎస్ గా మార్చారు... ఇప్పుడు ఆయన చేతిలోనే పార్టీ అంతమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. నాడు దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పిదం వల్లే బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు బతికిందని రఘునందన్ రావు అన్నారు.