Devineni Uma: టీడీపీ నిర్ణయం నాకు శిరోధార్యం: దేవినేని ఉమ
- చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపు
- నామినేషన్‌కు రావాలంటూ ఉమను ఆహ్వానించిన మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్
- వస్తానంటూ మాట ఇచ్చిన దేవినేని ఉమ
మైలవరం నియోజకవర్గంలో ఆదివారం కీలక పరిణామం జరిగింది. టికెట్ విషయంలో భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుని టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ కలిశారు. గొల్లపూడిలోని ఉమ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ ఘట్టానికి హాజరు కావాలని వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. హాజరవుతానంటూ ఉమ మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఐదేళ్లు పడ్డ కష్టాలను పక్కనపెట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులకు దేవినేని ఉమ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యమని ఈ సందర్భంగా తెలిపారు.
‘‘ వసంత కృష్ణప్రసాద్, నేను ఇద్దరం మైలవరం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటాం. రాక్షస రాజ్యాన్ని పారద్రోలేందుకు ఐదేళ్లు మనం పడ్డ కష్టాలను పక్కనపెట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. విజయవాడ పార్లమెంట్లో కేశినేని చిన్ని, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలి. మైలవరంలో గ్రామస్థాయి వరకు పార్టీ పటిష్ఠంగా ఉంది. ప్రతి కార్యకర్త రేపు నామినేషన్ కార్యక్రమానికి తరలిరావాలి’’ అని దేవినేని ఉమ పిలుపునిచ్చారు.