CAA: భారత పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించొచ్చు.. అమెరికా కాంగ్రెస్ పరిశోధన విభాగం
- పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ విభాగం నివేదిక
- ముస్లింలు మినహా మిగతా మతాలవారికి పౌరసత్వం ఇవ్వడం రాజ్యంగ విరుద్ధం కావొచ్చని వ్యాఖ్య
- పౌరుల జాతీయ రిజిస్టర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ముస్లింల హక్కులు ఉల్లంఘించొచ్చని కామెంట్
భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని అమెరికా చట్టసభల స్వతంత్ర పరిశోధన విభాగం కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అభిప్రాయపడింది. ఈ మేరకు సీఏఏపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని ముస్లింలు మినహా మిగతా ఆరు మతాల వారికీ పౌరసత్వం కల్పించే నిబంధన.. రాజ్యాంగంలోని కొన్ని అధీకరణలను ఉల్లంఘించొచ్చని అభిప్రాయపడింది. పౌరుల జాతీయ రిజిస్టర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇవి భారత ముస్లింల హక్కులను ఉల్లంఘించొచ్చని అభిప్రాయపడింది.
సీఏఏ వ్యతిరేకుల అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ పరిశోధన విభాగం తన నివేదికలో పొందుపరిచింది. హిందూ ఆధిపత్య పాలన కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని కొందరు భయపడుతున్నట్టు పేర్కొంది. ముస్లిం వ్యతిరేక విధానాలతో దేశానికున్న సెక్యులర్ స్వభావానికి ప్రమాదం ఉందని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఇది రాజకీయ లక్ష్యాలతో తెచ్చిన చట్టమని కూడా కొందరు భావిస్తున్నారని తెలిపింది. కొన్ని మతాలవారికి మినహా మిగతా వారికి భారత పౌరసత్వం పొందేందుకు పరిమితమైన అవకాశాలు ఉండేలా చట్టం తెచ్చారన్న అభిప్రాయాన్ని కూడా ఈ నివేదికలో పొందుపరిచారు.
1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం..2014, డిసెంబర్ 31కి ముందే భారత్‌కు వచ్చిన బంగ్లాదేశీయులు, పాకిస్థానీలు, ఆప్ఘనిస్థానీల్లో ముస్లింలు మినహా మిగతా ఆరు మతాల వారికి పౌరసత్వం ఇస్తారు.