Ayodhya Ram Temple: అయోధ్య రామయ్యకు పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి
- ప్రాణప్రతిష్ఠ నుంచి ఇప్పటివరకు 1.5 కోట్ల మంది భక్తుల దర్శనం
- ప్రతి నిత్యం లక్ష మందికిపైగా భక్తుల దర్శనం
- శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడి
ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముడికి పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ నుంచి ఇప్పటివరకు ఏకంగా 1.5 కోట్ల మంది భక్తులు రాములోరిని దర్శనం చేసుకున్నారు. ప్రతి రోజూ లక్ష మందికిపైగా భక్తులు మహా మందిరాన్ని సందర్శిస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. ఇటీవలే తొలి శ్రీరామనవమి వేడుకలను అయోధ్య ఆలయంలో నిర్వహించామని, ఆ రోజు దాదాపు 19 గంటల పాటు ఆలయాన్ని తెరచివుంచామని తెలిపారు.
రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయ్యిందని, మొదటి అంతస్తులో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ప్రాకారాన్ని నిర్మించనున్నామని, దీనిని ఆలయ 'పర్కోట' అంటారని వివరించారు. ఈ ప్రాకారం బహుళ ప్రయోజనంగా ఉంటుందని, ఇందులో భాగంగా మరో 6 ఆలయాలు నిర్మించనున్నట్టు చంపత్ రాయ్ తెలిపారు. భగవానుడు శంకర్, సూర్య భగవానుడు, ఒక గర్భగృహం, రెండు చేతులలో హనుమంతుడు, అన్నపూర్ణ మాతా దేవాలయం నిర్మిస్తామన్నారు. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య ఆలయాలను కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తామని వెల్లడించారు.