Seethakka: హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసింది: మంత్రి సీతక్క
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్ను ప్రజలు పక్కన పెట్టారని వ్యాఖ్య
- గ్యారెంటీలకే గ్యారెంటీ రేవంత్ రెడ్డి అన్న మంత్రి సీతక్క
- కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్న మంత్రి
హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ దేవుడిని పూజించే అగరబత్తులపై కూడా జీఎస్టీ వేసిందని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. ఆదిలాబాద్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర సభలో ఆమె మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. గ్యారెంటీలకే గ్యారెంటీ రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జీఎస్టీ తీసుకువచ్చి రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు పదేళ్లలో కూడా నెరవేరలేదన్నారు. జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేశారా? అని సీతక్క నిలదీశారు.